top of page
Post: Blog2_Post

ఆత్మజ్యోతి అఖండమైనది!


ప్రకాశమునకు రెండు ఆయామములు వుంటాయి, రెండు పక్షములు వుంటాయి. ఒకదానిని వేడి అనీ, రెండవదానిని కాంతి అనీ పిలువవచ్చును. ఒకదాని నుండి మనకు వేడిమి లభిస్తే - రెండవదాని నుండి మార్గదర్శనము ప్రాప్తిస్తుంది. చల్లగా ఉన్నచో ప్రకాశం నుండి వెలువడే వేడిమి మనకు వెచ్చదనాన్ని అందిస్తుంది. అంధకారముచేత చుట్టబడినచో అదే ప్రకాశకాంతి యొక్క ఒకానొక కిరణము మనకు సురక్షిత మార్గం వైపు దారిచూపిస్తుంది. ఆత్మ లోతుల నుండి వెదజల్లబడే ప్రకాశము కూడా ఈ రీతిలోనే పనిచేస్తుంది. తేడా అల్లా ఏమిటంటే ఒకసారి ఆత్మజ్యోతి వెలిగితే ఇక అది కొడిగట్టడం అసంభవం.


భౌతిక ప్రకాశ శ్రోతము యొక్క ప్రాదుర్భావము నియతియైతే మరి దాని అంతము కూడా సునిశ్చితమే అయ్యుంటుంది. చివరకు గ్రహనక్షత్రములు సైతం ఆద్యంతములు నిర్ధారించబడి, నిశ్చయించబడివుంటాయి. దీపము యొక్క కాంతి మొదలుకొని ట్యూబ్ లైట్ వెలుగు వరకు ఇవన్నీ కూడా ఏదో ఒకరోజున పూర్తిగా కాంతివిహీనమైపోతాయి. సమస్త లోకములకు వెలుగులను ప్రసాదించే సూర్య భగవానుడు కూడా ఒకానొక రోజున తన నుండి కాంతికిరణములను వెదజల్లటం ఆపివేస్తాడు.


ఐతే వీటన్నింటికీ వ్యతిరేకంగా 'ఆత్మికజ్యోతి' అఖండమైనది! ఆ దీపం ఒకసారి వెలిగించబడితే ఇక అది మసకబారటం అసాధ్యము. ఈ ఆత్మిక ప్రకాశమునకు మూలప్రోతము 'శ్రద్ధ!' శ్రద్ధతో తడిసిన అంత:కరణ సర్వేసర్వత్రా కాంతిని అనుభూతి చెందే దర్శించగలిగే స్థితిలో వుంటుంది. శ్రద్ధ అంకురిస్తే జీవితము వెలుగుతో నిండిపోతుంది. బాహ్యజీవితము కూడా పుణ్యపరమార్థము దిశగా గతిశీల మౌతుంది.


వ్యక్తిత్వము ఉత్కృష్టతతో అలరారుతుంది. అంతేకాదు ఆదర్శవాదిత్వము సహజ జీవనశైలిలో అంగమై భాసిస్తుంది. శ్రద్ధ బయటి కాంతి వలెనే ఊర్ణకు కేంద్రమే కాదు; ఆశకు మూలశ్రోతము కూడా! అనేకానేకమందికి దిశను ఇవ్వగలిగే కిరణములు సైతం దానినుండే వెలువడతాయి. కఠిన పరిస్థితులలో మనస్సును బలోపేతం చేయగలిగే సంకల్పశక్తి కూడ శ్రద్ధ కారణముగానే జనిస్తుంది. శ్రద్ధ వికసించినచో ఆత్మికప్రకాశమునకు అన్ని దారులు తెరచుకుంటాయి.


అనువాదం : శ్రీమతి లక్కరాజు లక్షీరాజగోపాలు


To Read Complete Magazine click below


Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page