top of page
Post: Blog2_Post

అంతరాత్మ పిలుపు

  • Writer: Akhand Jyoti Magazine
    Akhand Jyoti Magazine
  • Jul 16, 2021
  • 1 min read

భగవంతునికి పొగడ్తలు నచ్చవు. ఆయనకు ఎవరి స్తుతి, ఎవరి నింద పట్టదు. ఆయన ఎవరి పట్లా ప్రసన్నుడు కాడు, ఆప్రసన్నుడు కాడు. పూజ, ఉపాసన అనేవి ఒక విధమైన ఆధ్యాత్మిక వ్యాయామాలు. వీటిద్వారా మన ఆత్మబలం పెరుగుతుంది. సత్వగుణం పెరుగుతుంది. భగవంతుడు సర్వవ్యాపి అని నమ్మేవాడు పాపం చేయడానికి భయపడతాడు. పోలీసు అధికారి కళ్ళెదుట నిలిస్తే చోర ప్రవృత్తి కలిగిన మనిషి సైతం సాధుపురుషుడివలే వ్యవహరిస్తాడు. ‌ అందరికంటే పెద్ద పోలీసు అధికారి అయిన భగవంతుడు తన లోపల, బయట నలువైపులా వ్యాపించి ఉండడాన్ని చూసే వ్యక్తి పాపం చేయలేడు. ప్రతి ప్రాణిలో భగవంతున్ని చూసే వ్యక్తి అందరితో చక్కగా వ్యవహరిస్తాడు.

ఈ భగవత్ దృష్టిని పొందుటయే భగవంతుని ఆరాధనలోని ముఖ్య ఉద్దేశ్యం. ధ్యానం, ప్రార్థన, పూజ, కీర్తన, జపం మొదలైనవి మనోభూమిలో నాటుకున్న చెడు సంస్కారాలను తొలగించి సుసంస్కారాలను స్థాపించే మనో వైజ్ఞానిక ప్రక్రియలు.

*ఆ అంతరాత్మ పిలుపు వింటే, దాని సంకేతాల ప్రకారం నడిస్తే అతి చెడ్డ వ్యక్తి కూడా కొద్ది సమయంలోనే మహాత్ముడు కాగలుగుతాడు. భగవద్గీతలో భగవంతుడు ఇలా అన్నాడు.-" అన్నీ విడిచి నా శరణు కోరు; నీ యోగ క్షేమములు నేను చూస్తాను" నా శరణు అనగా అంతరాత్మ శరణు అని అర్థం.*

అఖండజ్యోతి,ఫిబ్రవరి, 1951

 
 
 

©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page